ఈ బ్లాగ్ ప్రాంభమయి సంవత్సరమయిందని నా మిత్రులు కిరణ్ ప్రభగారు గుర్తుచేశారు. అసలు ఈ బ్లాగ్ ని వారింట్లోనే (కాలిఫోర్నియాలో) ఆయనే డిజైన్ చేసి ప్రారంభించారు. దాదాపు 40 ఏళ్ళ కిందట పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఆంధ్రజ్యోతిలో కాలం రాయమన్నప్పుడు భయపడ్డాను. కారణం - అప్పుడు తలమునకలుగా సినిమాల్లో నటిస్తూండడం. కొంతకాలం తర్వాత నండూరి రామమోహన రావుగారు వత్తిడి చేసి, పురాణం మద్దతుని సంపాదించి నన్ను దినపత్రికలో రాసేటట్టు చేశారు. క్రమంగా ఆ రుచి మరిగి ఇప్పటిదాకా ఆ పనిని నిరంతరాయంగా చేస్తూ వస్తున్నాను. పుట్టిన మనిషికి ఊపిరి పీల్చడం లాగ - ఆలోచించే మనిషికి తన ఆలోచనల్ని చెప్పుకునే వేదిక 'ఊపిరి'లాంటిది. అయితే ఈ బ్లాగ్ వ్యవహారం నాకు లొంగుతుందా అని భయపడ్డాను. ఆ పనీ తానే చేస్తానన్నారు. మరొక ముఖ్యమయిన సందేహం - కొన్ని బ్లాగులు చూసినప్పుడు ఊసుపోని వ్యవహారంగా - అనవసరంగా, అర్ధంలేని కబుర్లతో కాలక్షేపంగా కనిపించింది. అది నా వంటికి పడని విషయం. కాగా అంత తీరికా, అలాంటి అభిరుచీ బొత్తిగా లేనివాడిని. కనుక - ఈ బ్లాగులో కనిపించే విషయాల్ని 'ఫిల్టర్ ' చేసే బాధ్యతా ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు - సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు - అలాంటి ఊకదంపుడికి తొలిరోజుల్లో ప్రయత్నాలు జరిగి, కయ్యానికి కాలుదువ్వే పనులు కొందరు చేసినా - వాటిని ఇక్కడ మినహాయించడాన్ని గమనించి మానుకోవడమో, తప్పుకోవడమో చేశారు. అది ఆరోగ్యకరమైన పరిణామం. ఈ సంవత్సరం పొడుగునా ఈ బ్లాగు చదివేవారికి - నిజమైన, సహేతుకమైన, సలక్షణమైన సందేహాలో, విమర్శలో చేసినప్పుడు నా స్పందనని గమనించే ఉంటారు.
ఈ వార్షికోత్సవంలో నాతో నా ఆలోచనలు పంచుకునే సహృదయులందరికీ - ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు నా అభినందనలు, కృతజ్నతలు. అంతకు మించి - ఈ బ్లాగు వెర్రితలలు వేస్తోందనిపిస్తే ఎప్పుడో తప్పుకునేవాడిని.
కొత్త ఆలోచన వచ్చినప్పుడు, కొత్తగా వేదన కలిగినప్పుడు, ఓ ప్రాణ మిత్రుడు శెలవు తీసుకున్నప్పుడు ఓ అన్యాయం సమాజానికి జరిగిందని బాధ కలిగినప్పుడు - వెతుక్కునే స్నేహితుని ప్రతిస్పందనే ఈ బ్లాగు పరమార్ధమని నేను నమ్ముతాను. ఈ సంవత్సరం పాటూ నాతో అలాంటి ఆలోచనలనే పంచుకున్న మీ అందరికీ నా అభినందనలు. కృతజ్నతలు. మనిషి ఏకాంతంలో ఆలోచించినా తన చుట్టూ ఉన్న సమాజంలోనే, సమాజంతోనే స్పందిస్తాడు ఆ గుండె చప్పుళ్ళకు 'మారుతీయం' వేదిక కావాలని నా ఆశ. ఈ ఆశతోనే మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం.