Wednesday, July 28, 2010

వెన్నెల కాటేసింది

నలభై సంవత్సరాల క్రిందట నేను వ్రాసిన నవల ఇది. క్రిందటి సంవత్సరం 'కౌముది ' లో సీరియల్ గా వచ్చినప్పుడు ఈ తరం పాఠకులనుంచి వచ్చిన స్పందన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇందుక్కారణం సున్నితమైన మానవ సంబంధాలకున్న బలం.. అని నాకనిపించింది. బ్లాగు మిత్రులకి కూడా దీన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ పోస్టు వ్రాస్తున్నాను.
ఈ నవల వెనుక నున్న చిన్న నేపథ్యం గురించి ఒక్క సారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ..ఇందులోని సుబ్బులు పాత్రకి మాత్రుక - నా పధ్నలుగో యేట నా ఆలోచనల్లో దొరికింది. మేము అద్దెకుండే ఇంట్లో ఒక వాటాలో ఉండే వారింటికి ఓ అమ్మాయి వచ్చింది. నా వయస్సేనేమో. ప్రేమా దోమా తెలీని దశ అది. ఒక వేళ మనస్సులో ఏదో ఆకర్షణ ఉన్నా - దానికి ఇతమిథమైన రూపం లేదు. తీరా ఆమె కొన్నాళ్ళుండి వెళ్ళిపోయాక ఓ పద్యం రాసుకున్నాను
పోయితివి నీవు నను వీడిపోయి ఎటకో
యేను నీ పదఛాయల వేగలేక
వేడి నిట్టూర్పు కెరటాల నీడలందు
జీర్ణమయిపోవు దుఃఖంపు జీరనైతి..
మరో పదేళ్ళకి సుబ్బులు ప్రాణం పోసుకుని నా నవలలో పాత్రయింది.
మీరూ చదవండి..!

Monday, July 26, 2010

కోమాలో మన దేశం

కొన్ని రోజుల కిందట భారత పరిశ్రమ సమాఖ్య యూరోపు విభాగపు డైరెక్టర్ మోహన మూర్తి అనే ఆయన జర్మనీలో ఒక చర్చ కార్యక్రమంలో పాల్గోన్నారట. ఆ చర్చలో పాల్గొన్న వారంతా ఈ మూర్తి గారిని చూసి "ఏం బాబూ! మీ దేశం కోమాలో ఉందా? కళ్ళు తెరుస్తోందా ?" అని వెక్కిరించి ముక్కుమీద వేలేసుకున్నారట. వాళ్లు చెప్పే వివరణలు వింటూ ఈయన తెల్ల మొహం వేసారట. మూర్తి గారికి సరైన అనుచరులు లేరు. నన్ను తీసుకెళ్ళి వుంటే - యూరోపు ప్రముఖుల కళ్ళు తెరిపించే లాగ - మనవాళ్ళు "కళ్ళు" తెరుచుకునే ఉన్నారని చెప్పి ఒప్పించేవాడిని.

Sunday, July 18, 2010

మతం..హితం..

మధ్య పూణే వెళ్ళాను. అక్కడొక వింత దృశ్యం నన్నాకర్షించింది. నిజానికి ఎవరినయినా ఆకర్షించేదృశ్యమది. స్కూటర్ల మీద తిరిగే అమ్మాయిలందరూ కళ్ళుమాత్రం కనిపించేలాగ ముఖమ్మతా గుడ్డల్ని చుట్టుకుని ఉన్నారు. సరే. ఆరోగ్య సూత్రాల ప్రకారం బొగ్గుపులుసు వాయువుని పీలుస్తున్నారనుకుందాం. కళ్ళు మాత్రమే కనిపించే ముసుగు దేనికి? రోడ్డు మీద దుమ్ము దూసర వారు ముక్కుపుటాల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తట. ఇది చాలా విడ్డూరమైన దృశ్యం. మా మిత్రుడిని అడిగాను. ఆయన నవ్వి కొన్నాళ్ళ క్రితం ఇదే అనుమానం కొత్తగా వచ్చిన నగర కమీషనర్ సత్యపాల్ సింగ్ గారికి వచ్చిందట. ఆయన ఏదో సభలో 'టెర్రరిస్టుల్లాగ ' అమ్మాయిల ముఖాలకి ముసుగులేమిటి?" అన్నారట. అంతే. ముసుగుమాట వదిలేసి 'టెర్రరిస్ట్ ' అనే మాటని ఆడపిల్లలు పట్టుకున్నారట. "మమ్మల్ని టెర్రరిస్టులంటారా? " అని రెచ్చిపోయారట.

Saturday, July 17, 2010

మొదటి వసంతం పూర్తిచేసుకున్న 'మారుతీయం '

ఈ బ్లాగ్ ప్రాంభమయి సంవత్సరమయిందని నా మిత్రులు కిరణ్ ప్రభగారు గుర్తుచేశారు. అసలు ఈ బ్లాగ్ ని వారింట్లోనే (కాలిఫోర్నియాలో) ఆయనే డిజైన్ చేసి ప్రారంభించారు. దాదాపు 40 ఏళ్ళ కిందట పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఆంధ్రజ్యోతిలో కాలం రాయమన్నప్పుడు భయపడ్డాను. కారణం - అప్పుడు తలమునకలుగా సినిమాల్లో నటిస్తూండడం. కొంతకాలం తర్వాత నండూరి రామమోహన రావుగారు వత్తిడి చేసి, పురాణం మద్దతుని సంపాదించి నన్ను దినపత్రికలో రాసేటట్టు చేశారు. క్రమంగా ఆ రుచి మరిగి ఇప్పటిదాకా ఆ పనిని నిరంతరాయంగా చేస్తూ వస్తున్నాను. పుట్టిన మనిషికి ఊపిరి పీల్చడం లాగ - ఆలోచించే మనిషికి తన ఆలోచనల్ని చెప్పుకునే వేదిక 'ఊపిరి'లాంటిది. అయితే ఈ బ్లాగ్ వ్యవహారం నాకు లొంగుతుందా అని భయపడ్డాను. ఆ పనీ తానే చేస్తానన్నారు. మరొక ముఖ్యమయిన సందేహం - కొన్ని బ్లాగులు చూసినప్పుడు ఊసుపోని వ్యవహారంగా - అనవసరంగా, అర్ధంలేని కబుర్లతో కాలక్షేపంగా కనిపించింది. అది నా వంటికి పడని విషయం. కాగా అంత తీరికా, అలాంటి అభిరుచీ బొత్తిగా లేనివాడిని. కనుక - ఈ బ్లాగులో కనిపించే విషయాల్ని 'ఫిల్టర్ ' చేసే బాధ్యతా ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు - సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు - అలాంటి ఊకదంపుడికి తొలిరోజుల్లో ప్రయత్నాలు జరిగి, కయ్యానికి కాలుదువ్వే పనులు కొందరు చేసినా - వాటిని ఇక్కడ మినహాయించడాన్ని గమనించి మానుకోవడమో, తప్పుకోవడమో చేశారు. అది ఆరోగ్యకరమైన పరిణామం. ఈ సంవత్సరం పొడుగునా ఈ బ్లాగు చదివేవారికి - నిజమైన, సహేతుకమైన, సలక్షణమైన సందేహాలో, విమర్శలో చేసినప్పుడు నా స్పందనని గమనించే ఉంటారు.
ఈ వార్షికోత్సవంలో నాతో నా ఆలోచనలు పంచుకునే సహృదయులందరికీ - ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు నా అభినందనలు, కృతజ్నతలు. అంతకు మించి - ఈ బ్లాగు వెర్రితలలు వేస్తోందనిపిస్తే ఎప్పుడో తప్పుకునేవాడిని.
కొత్త ఆలోచన వచ్చినప్పుడు, కొత్తగా వేదన కలిగినప్పుడు, ఓ ప్రాణ మిత్రుడు శెలవు తీసుకున్నప్పుడు ఓ అన్యాయం సమాజానికి జరిగిందని బాధ కలిగినప్పుడు - వెతుక్కునే స్నేహితుని ప్రతిస్పందనే ఈ బ్లాగు పరమార్ధమని నేను నమ్ముతాను. ఈ సంవత్సరం పాటూ నాతో అలాంటి ఆలోచనలనే పంచుకున్న మీ అందరికీ నా అభినందనలు. కృతజ్నతలు. మనిషి ఏకాంతంలో ఆలోచించినా తన చుట్టూ ఉన్న సమాజంలోనే, సమాజంతోనే స్పందిస్తాడు ఆ గుండె చప్పుళ్ళకు 'మారుతీయం' వేదిక కావాలని నా ఆశ. ఈ ఆశతోనే మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం.

Sunday, July 11, 2010

అయ్యో!ఆహా..!

మధ్య చాలా చోట్ల చాలా రకాలయిన హత్యలు జరిగిపోతున్నాయి. వాటి గురించి వింటేనే గుండె బరువెక్కి వేదన
కలుగుతుంది.మొన్నటికి మొన్న అజాద్ మరణం గురించి పేపర్లో చూశాం. అలాగే హేమచంద్ర అనే పాత్రికేయుడి మరణం.
వారి తల్లిదండ్రులు,సమీప బంధువులు, స్నేహితులూ కార్చిన కన్నీరు, వారికి జరిగిన దుర్ఘటన, నిండు ప్రాణాలు
బలయిపోయిన దైన్యత - ఇవన్నీఆయా పత్రికల పుణ్యమాంటూ తెలిశాయి. ఎన్నో వ్యాసాలు ఉదారంగా రాశారు.
అవన్నీ జరిగిన దుర్ఘటన, జరగకూడని అన్యాయాన్నివివరించాయి. పత్రికలు వారి తల్లిదండ్రులు, సానుభూతిపరులు
ఫోటోలను చక్కగా ప్రచురించారు. ఇవన్నీ వారికి నిజమైన నివాళి.మనకూ బాధకలిగించిన సందర్భమది.

Monday, July 5, 2010

లయ

ఇవాళ్టితో వింబుల్డన్ టెన్నిస్ చాంపియన్ షిప్పు పోటీలు ముగుస్తాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా - టెన్నిస్ పోటీలుచూడడానికి టీవీకి అతుక్కు పోవడానికి మరో ముఖ్యమయిన కారణం ఉంది.అది "రోలెక్స్" వాచీ ప్రకటన స్పాట్. (ఇప్పటిది కాదుఇంతకుముందు చేసింది ఇప్పుడు వేస్తున్నారు) అది అద్బుతం. ప్రపంచ స్థాయి ఆటగాడు రోజర్ ఫెడరర్ ని అంతే ప్రపంచ స్థాయికెమెరామన్, దర్శకుడు - ప్రపంచ స్థానంలోనే 30 సెకన్ల చిత్రాన్ని నిర్మించాడు. ఇంత కంటే వివరించడానికి నాకు మాటలు చాలవు.మీరు చూడాలి . వెలుగు నీడల్లో ఫెడరర్ బంతిని కొట్టే భంగిమలు ప్రయత్నించినా నిర్ణయించగలిగేవికావు. ఒక మహా 'కళాకారుడు ' (గమనిచండి - ఆటగాడు అనడంలేదు) ఒక తన్మయ దశలో అలవోకగా చేయగలిగేవి. శరీరం కదలికలో సంగీతం పలుకుతుంది. సంగీతాన్ని - వెలుగునీడల సమ్మేళనంగా - స్పాట్లో ఆఖరి ఫేడవుట్లో బంధించారు - అద్బుతం.