Sunday, January 16, 2011

చందూర్ స్మృతి....

చెన్నైలో ఆగస్టు 7న సవేరాలో ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్యగారికి కొందరు తెలుగు మిత్రులు విందు చేశారు. ఇలాంటి కార్యక్రమాలలో సాధారణంగా అందరు తెలుగు ప్రముఖులు హాజరుకావడం రివాజు. ఆనాడు చందూరు దంపతులు (ఎ.ఆర్.చందూర్, మాలతీ చందూర్) వచ్చారు. భోజనాలయాక హోటల్ ప్రాంగణంలో అతి అందమయిన కారెక్కారు ఎన్.ఆర్.చందూర్ గారు. "కారు చాలా ముద్దుగా ఉంది" అన్నాను ఆయనతో. వెనకనే వస్తున్న మాలతీ చందూర్ గారు అందుకుని "నేను లేనా? దుర్మార్గుడా! అన్నారు. చేతులు జోడించి "80 ఏళ్ళ మీ గురించి 94 ఏళ్ళ మీ ఆయనకి ఏం చెప్పనమ్మా" అన్నాను. కారు వెళ్ళిపోయింది. అదీ నేను చందూర్ గారిని ఆఖరుసారి చూడడం. అదీ ఆ దంపతులూ సెన్సాఫ్ హ్యూమర్కి, అన్ని సంవత్సరాల జీవితంలో సరసత్వానికీ మచ్చుతునక.
పూర్తిగా చదవండి

2 comments:

  1. అందరి బంధువు అయిన మాలతీ చందూర్ గారికి ప్రగాఢ సంతాపం
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  2. మారుతీ రావు గారూ,
    ఎన్నార్ చందూర్ గారు పోయారని ఇప్పుడే కౌముదిలో మీ వ్యాసంలో చదవగానే చాలా బాధ వేసింది. రెండేళ్ళ క్రితం మనిద్దరం కచేరీ రోడ్ లో వాళ్ళింటికి వెళ్ళి ఆయన తోటీ, మాలతో చందూర్ గారి తోటీ గడిపిన ఐదారు గంటలూ ఐదు నిమిషాలుగా గడిచిపోయిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది. నేను అంతకు ముందు ఒకటి రెండు సార్లు వారింటికి వెళ్ళినా, మీకు అదే మొదటి సారి అని మీరు అన్నట్టు నాకు గుర్తు.
    ఇంచుమించు పదేళ్ళనుంచీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా ముందు శ్రీ చందూర్ గారే ఫోన్ తీసి, ఆప్యాయంగా పలకరించి, విషయం కనుక్కుని, తన అభిప్రాయం చెప్పి తరువాత మాలతి గారికి ఫోన్ ఇచ్చే వారు. ఆయన పత్రిక "జాగృతి" లో నా రచనల గురించి కానీ, వంగూరి పౌండేషన్ కార్యకలాపాల గురించి కానీ ప్రకటించినప్పుడల్లా, అప్పుడప్పుడు స్వహస్తాలతోనూ, లేక పోతే మంచి ఆంగ్ల భాషలో లెటర్ హెడ్ మీద టైప్ చేయించీ, ఆ పత్రిక కాపీ అమెరికా పంపించే వారు. అంతెందుకూ? 2009 లో మనిద్దరం చందూర్ గారి ఇంట్లో మీరు చదివి వినిపించిన రెండు కవితలూ ప్రచురించిన "జాగృతి" పత్రిక కాపీలని కూడా ఆయన నాకు అమెరికా పంపించారంటే అది ఆయన నిబధ్దతకి కొలమానం. ఆ రోజున ఆయనే ఇంటి ముందు ఉన్న ఈ శతాబ్దపు తొలి రోజులలో పెద్ద, పెద్ద చక్రాలతో ఉండే wheel chair తో సహా ప్రతీ గదీ ఎంతో ఆసక్తితో చూపించారు. పైన డాబా మీద మాలతి గారు వేసిన రూఫ్ గార్డెన్, పండిస్తున్న దొండ కాయల గురించీ సగర్వంగా చెప్పుకున్నారు ఆ నాడు శ్రీ చందూర్ గారు. మీరు ప్రస్తావించిన కథల పోటీ వంగూరి ఫౌండేషన్ తరఫున 2009 లో నిర్వహించిన మొట్ట మొదటి అంతర్జాతీయ కథల పోటీయే కదా! అప్పుడు కూడా కేవలం మీతో చెప్పి వదిలెయ్య కుండా "మాలతి గారిని న్యాయ నిర్ణేతగా ఉండమని అడిగినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీకు చెప్పిన కారణాన్నే పేర్కొంటూ నాకు పెద్ద ఉత్తరం వ్రాశారు చందూర్ గారు.

    నేను ఆయననీ, మాలతి గారినీ చాలా సార్లు అటు ఇండియాలో సదస్సులకీ, ఇటు అమెరికాలో సదస్సులకీ ఆహ్వానింఛాను. ప్రతీ సారీ "మేము విమాన ప్రయాణాలు ఎక్కువ చెయ్యం" అనీ, మేమూ, బాపూ గారూ సభలకి వెళ్ళే మనుషులం కాదు అని తప్పించుకునే వారు. ఇక 2006 లో, నేను మా హ్యూస్టన్ రాక తప్పదని చెప్పి, "మీకేం పరవా లేదు. మీకు ఏ కష్టమూ కలగకుండా బాపూ గారూ, పప్పు వేణుగోపాల రావు గారూ, ఆయన భార్య తోడుగా ఉంటారు" అని నేను బలవంతపెడితే రావడానికి ఒప్పుకున్నారు కానీ ఆఖరి క్షణంలో ఆరోగ్యం సహకరించదేమో అని అనుమానంతో వారిద్దరూ ప్రయాణం విరమించుకున్నారు..అప్పటికే ఆయన వయసు ఇంచుమించు 90 ఏళ్ళు. శ్రీ చందూర్ గారినీ, మాలతి గారినీ కనీసం ఒక్క సారి కూడా అమెరికా రప్పించుకోలేక పోవడం మా దురదృష్టం. ఒక వేళ వారు ఎప్పుడైనా అమెరికా వచ్చి ఉంటే, అది నాకు తెలియక పోవడం నా వ్యక్తిగత దురదృష్టం.

    ఈ రోజుల్లో అరుదైన మంచీ, మర్యాదలు, ఆత్మీయత మూర్తీభవించిన మహా మనీషి, "జాగృతి" సాహిత్య పత్రికని నలుగు దశాబ్దాల పాటు నడిపిన శ్రీ చందూర్ గారు ఎప్పుడు మాట్లాడినా, ఉత్తరం వ్రాసినా మాలతి గారి గురించి ఎక్కువా, తన గురించి తక్కువా ఉండేవి. మీరు వ్రాసినట్టుగా ఆయన మాలతి గారికి, తద్వారా తెలుగు సాహిత్యానికి అందించినది నిస్వార్ధమైన, నిరంతర సహకారం. మద్రాసులో జరిగిన నా పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలనింటికీ మాలతీ చందూర్ గారూ, శ్రీ చందూర్ గారే ప్రధాన అతిథులు. ఈ సమయంలో, మీ కాలమ్ ద్వారా, మాలతీ చందూర్ గారికి నా ప్రగాఢమైన సానుభూతి తెలపడం తప్ప చెయ్యగలిగినది ఏముంది?

    ___వంగూరి చిట్టెన్ రాజు
    హ్యూస్టన్, టెక్సస్.

    ReplyDelete