Wednesday, August 11, 2010

నా మాట




నా పేరు శ్రీనివాస్ గొల్లపూడి

మిమ్మలనలరించాలీ

ఆడీ పాడీ..,

మీ నవ్వులు మీ గుబులూ

తెరపైన చూపించే

డైరెక్టరునవ్వాలని..

నే..కోరుకున్నా!

´´´

మొదలెట్టానొక చిత్రం

'ప్రేమ'ను కావ్యంగ ఎంచి

కొన్ని పుటలు లిఖించాక

ఆపదొచ్చెనను వరించి

'మృత్యు 'వన్న పక్షి ఒకటి

నా మీదే వాలిందీ

అలలలోన ముంచివేసి

నా ప్రాణంగైకొందీ

చెమరించని కళ్ళులేవు

దుఃఖించని గుండెలేదు

'అయ్యో ' అని విలపించని

బంధుమితృలొకరు లేరు

ఎగసి పడే సంద్రంలో

నడీ మధ్యన నావలాగ

నా కావ్యం మిగిలింది

నన్ను చూసి నవ్వింది

´´´

అది చూసినవాళ్ళు

గుండె పగిలి ఏడ్చారు

ఇలా ఇలా కావ్యం

మిగలకూడదన్నారు.!

´´´

వందనాలు నాన్నా

తోడు నీవు నిలిచావూ

నేను 'వదిలి ' వచ్చిన పని

నీవు పూర్తిచేశావూ..!

గుండెముక్కలౌతున్నా

మెగాఫోను పట్టావూ

నేను కన్న 'తీపికలను '

కావ్యంగా మలిచావు..!

´´´

నేను 'పొంద 'లేనిదాన్ని

ఇతరులు అయినా పొందే

అవకాశం ఇవ్వాలని

ప్రతిన ఒకటి పూనావూ!.

నాలాగే సరికొత్తగ

చలన 'చిత్ర 'లోకంలో

తమ 'ప్రజ్న 'ను చూపుకుంటె

అదే చాలునన్నావు!

´´´

నా పేరిట.. నా గుర్తుగ

'పురస్కార ' మొకటి చేయ

సంకల్పము చేశావూ

తగిన 'వనరు 'లిచ్చావు!

దిగులు..గుబులు ఇంకేలా

'నా ' కోరిక తీరగా

వత్సరానికొక రోజున

నేను 'మిమ్ము 'కలువగా!

ఇసుక మేడ కూలినచో

బాధపడుట దండగ

కలల అలల ఊయలలో

'ఆత్మ' తేలుచుండగా!

´´´

వత్సరానికొకరోజున

మరలా ప్రభవించనా

'ప్రతిభ ' చూపు 'దర్శ'కులను

ఆకసానికెత్తనా!

´´´

నేనున్నా లేకున్నా

నా వారలు ఉన్నారు!

మీ శ్వాసలో ...మీ గెలుపులో

నన్ను 'చూసు'కుంటారు!

´´´

ఇరుకు ఇరుకు శరీరాన

'నాడు ' నేను బ్రతికున్నా..

విశ్వవ్యాప్తమై 'నేడు'

మీలో జీవిస్తున్నా!

సెలవా మరి ఇక ఉంటా

మరోసారి కలుస్తా

మిమ్మలనలరించేలా

'మరో 'కలని నే తెస్తా...!

ఇట్లు

మీ శ్రీనివాస్ గొల్లపూడి

విన్నది

భువన చంద్ర

5 comments:

  1. ఇప్పటికి ఆ వార్త స్మృతి పధం లో అల్లానే వుండి పోయింది.
    షూటింగ్ లో లీనమై వర్ధమాన దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్
    అలల తాకిడికి బలై పోయి సుదూర తీరాలకి వెళ్లి పోవడం
    బయట వ్యక్తులకే ఇంత బాధ అనిపిస్తే ఆత్మీయుల బాధ
    మాటలకందని మౌన వేదనే . వొక కోటా కి ,బాబుమోహన్ కి
    వొక గొల్లపూడి గారికి యి వయసులో రావలిసిన కష్టం ఎంతమాత్రం కాదు
    అదికూడా అన్ని వేల మందిని తమ నటనతో ఆనంద పరిచిన ఆత్మీయులకి .

    ReplyDelete
  2. మీరు బతికేవున్నారు అనిపించి కళ్ళు చెమర్చ్చాయి కాస్సేపు. ...మీపేరిట పురస్కారం అందరికి గుర్తుచేస్తూనే వుంటుంది...లక్ష్మి రాఘవ

    ReplyDelete
  3. గొల్లపూడి కుటుంబం చేస్తున్న కృషి చూస్తుంటే నాకూ ఒక సినిమా తీసి ఆ అవార్డు అందుకోవాలని కోరికగా ఉంది.

    ReplyDelete
  4. ఇరుకు ఇరుకు శరీరాన ..... ఓదార్పు ఇవ్వటంలో ఇంత విశాల హృదయం! భువనచంద్ర గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ఘనకీర్తిని ఇంకా ఇంకా ఇవ్వాలి.

    ReplyDelete
  5. చదువుతుంటే కళ్ళు చమర్చాయి . మన ఆశలని, కలలని, మన తదనంతరం వాల్లకోదిలి పోవలసిన వాళ్ళం. శ్రీనివాస్ ఇంత అర్ధాంతరంగా
    తనువూ చాలించడం ,పైగా తన పనులని తండ్రికి వప్పజేప్పడం, ఏ వయసులో ఇంత భారం నామీద ఎలా వేసావురా నాన్న అనక ,
    కొడుకు విశ్వవ్యాప్తమై 'నేడు'మీలో జీవిస్తున్నా!
    వత్సరానికొకరోజున మరలా ప్రభవించనా
    అంటుంటే తట్టుకునే శక్తిని భగవంతుడే మీకు ఇచ్చాడు.

    ReplyDelete